ప్రస్తుతరోజుల్లో ప్రతిఒక్కరూ ఆఫీసు కార్యకలాపాలతో నిత్యం బిజీగా వుండటం వల్ల సమయానికి భోజనం చేయడానికి వీలుగా వుండదు. పనిభారం ఎక్కువగా వున్న నేపథ్యంలో కొంతమంది తిండి కూడా మానేస్తున్నారు. ఇక ఉదయాన్నే లేవగానే రెడీ అవ్వడానికి సమయం సరిపోతుండటంతో బ్రేక్’ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్లిపోవడం జరుగుతోంది.
అయితే రోజూ బ్రేక్’ఫాస్ట్ చేయకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి... అటువంటి బిజీ వ్యక్తులకు తక్కువ సమయంలోనే వంటకాలు చేసుకోవడానికి వీలుగా కొన్ని ఆహారాలున్నాయి. అందులో ఆనియన్ రైస్ రిసిపీ ఒకటి. తమ వ్యక్తిగత పనులు నిర్వహించుకుంటూనే.. ఈ రిసిపీని సులభంగా తయారుచేయొచ్చు. మరి దీనిని ఎలా చేస్తారో తెలుసుకుందాం...
ముందుగా ఈ రిసిపీని తయారుచేయడానికి కావలసిన పదార్థాలను సేకరించుకుని పెట్టుకోవాలి. అవి... బియ్యం (2cups); ఉల్లిపాయలు (2); వెల్లుల్లి రెబ్బలు (2); ఆవాలు (1/2tbsp); పచ్చిమిర్చి (4); పెప్పర్ (2tbsp); నూనె (3tbsp); నిమ్మరసం (2tbsp); రుచికి సరిపడేంత ఉప్పు.
తయారీవిధానం :
1. పదార్థాలను సేకరించిన అనంతరం ముందుగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి.
2. మరోవైపు ఒక పాన్’ను స్టౌవ్ మీద పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు వేసి 10 సెకనుల వరకు వేగించాలి.
3. అనంతరం అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి తదితర పదార్థాలు ఒకదాని తర్వాత మరొకటి వేసి 10 నిముషాలవరకు ఉడికించాలి.
4. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్’లోకి వచ్చేవరకూ వేగించిన తర్వాత అందులో ఇదివరకు వండిపెట్టుకున్న అన్నం, రుచికి సరిపడా ఉప్పు, పెప్పర్ తదితర పదార్థాలు వేసి.. ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా చేస్తుండగానే అద్భుతమైన సువాసన రావడాన్ని గమనించవచ్చు.
5. ఫ్రై చేసిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి దానిపై నిమ్మరసం చిలకరించి మిక్స్ చేయాలి. అంతే! టేస్టీ ఉల్లిపాయ రైస్ రిసిపీ రెడీ!