మైసూర్ బోండా అంటే ఎవరికి ఇష్టముండదో చెప్పండి.. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మాన్’సూన్ సమయంలో అయితే వీటిని ప్రత్యేకంగా వండుకుని తింటారు.
అయితే నేడు వాతావరణ పరిస్థితులతో ఎటువంటి సంబంధం లేకుండా బ్రేక్’ఫాస్ట్’లోకి వీటిని రెగ్యులర్’గా తయారుచేసుకుంటున్నారు. ఎక్కువ సమయం, కష్టం వెచ్చించకుండానే అతి తక్కువ సమయంలో సులభంగా వీటిని చేసుకొని తినొచ్చు. పైగా ఇవి ఎంతో రుచికరంగా వుంటాయి కూడా! మరి వీటిని ఎలా చేస్తారో తెలుసుకుందామా...
మైసూర్ బోండా తయారీకోసం కావలసిన పదార్థాలను ముందుగానే సేకరించి పెట్టుకోవాలి. అవి : మైదాపిండి (2 కప్స్); బియ్యపు పిండి (2 కప్స్); పుల్లమజ్జిగ (2 కప్స్); నూనె (2 కప్స్); పచ్చిమిర్చి (5-6); జీలకర్ర (2 చెంచాలు); వంటసోడా (తగినంత); చివరగా చిరుకి సరిపడేంత ఉప్పు.
తయారీ విధానం :
1. ఒక పాత్ర తీసుకుని అందులో తగినంత పుల్లమజ్జిగ వేసుకోవాలి. అనంతరం అందులో మైదాపిండి, బియ్యపు పిండిలను వేసి బాగా కలుపుకోవాలి.
2. ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పుతోబాటు తగినంత వంటసోడాలను కలుపుకొని.. దాదాపు 5 గంటలవరకు నానబెట్టుకోవాలి.
3. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఆ మిశ్రమపిండిలో పచ్చిమిర్చి, జీలకర్రలను వేసి కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌవ్ మీద బాణాలి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. బాగా వేడైన అనంతరం అందులో పిండిని బోండంలాగా చేసి వేయాలి.
5. గోధుమరందు వన్నె వచ్చేంతవరకు బోండాన్ని వేగించుకోవాలి. రంగు వచ్చిన తర్వాత దానిని నూనె నుంచి తీసి ప్లేటులో వేసుకోవాలి. అంతే! మైసూర్ బోండా రెడీ!