మాంసాహారప్రియులు చికెన్’తో తయారయ్యే వివిధరకాల వంటకాలను ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. అయితే ఇతర రెసిపీలతో పోల్చుకుంటే చికెన్ తందూరి స్పైసీగా, క్రంచీగా, ఎంతో రుచికరంగా వుంటుంది. ఈ తందూరి చాలావరకు మార్కెట్లలోనే లభ్యమవుతుంది. కచ్చితంగా దీనిని తయారుచేసే పద్ధతి అందరికీ తెలిసి వుండదు. దాంతో బయటచేసిన వాటికంటే ఇంట్లోచేసిన తందూరి రుచిలో చాలా డిఫరెంట్’గా వుంటుంది. అలాకాకుండా ఇంట్లోనూ ఎంతో టేస్టీగా తందూరి చికెన్ చేయాడానికి సింపుల్ టిప్స్ అందుబాటులో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాం...
తయారీవిధానాన్ని తెలుసుకోవడానికంటే ముందు దీని తయారీకి కావలసిన పదార్థాలను ఏంటో చూద్దాం.. అవి : చికెన్ (1/2 కెజీ); పెరుగు (1 కప్పు); రెడ్ ఫుడ్ కలర్ (కొన్ని చుక్కలు); పచ్చిమిర్చి పేస్ట్ (1 టీ స్పూన్); గరం మసాలా (2 టేబుల్ స్పూన్లు); ఉల్లిపాయ పేస్ట్ (1/4 కప్పు); అల్లం పేస్ట్ (2 టీ స్పూన్లు); నిమ్మరసం (2 టీ స్పూన్లు); వెల్లుల్లి రెబ్బలు (2); నూనె (తగినంత); చివరగా రుచికి సరిపడేంత ఉప్పు.
తయారీ విధానం :
1. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగిన అనంతరం తడి ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టాలంటే వాటికి గాట్లు పెట్టుకుంటే మంచిది.
2. ఇక తడి ఆరిన తర్వాత చికెన్ ముక్కలకు నిమ్మరసం, ఉప్పులతో బాగా మ్యారినేట్ చేయాలి. గాట్లలో కూడా నిమ్మరసం పట్టేలా చేయాలి. ఇలా చేసిన అనంతరం ముక్కలను అరగంటపాటు ఫ్రిజ్’లో పెట్టాలి.
3. మరోవైపు అల్లం, వెల్లుల్లి, ఉల్లి, గరంమసాలా తదితర పదార్థాల పేస్టులను ఒక పాత్రలో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. (ఈ మసాలాలో ఫుడ్ కలర్ చేర్చుకుంటే మంచిది). ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్’లో పెట్టిన చికెన్ ముక్కలను బయటికి తీసి, వాటికి పట్టించాలి.
4. చికెన్ ముక్కలకు మసాలా పట్టించిన అనంతరం మళ్లీ నాలుగు గంటలపాటు ఫ్రిజ్’లో పెట్టి వదిలేయాలి.
5. తర్వాత స్టౌవ్ మీద ఒక పాన్’ను పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. కాగిన తర్వాత అందులో ఇదివరకు మ్యారినేట్ చేసి ఫ్రిజ్’లో పెట్టిన ముక్కలను బయటకు తీసి వేయాలి.
6. ఇలా 15 నిముషాల వరకు నూనెలో చికెన్ ముక్కలను రెండువైపులా తిప్పుతూ పూర్తిగా ఉడికించాలి. అంతే! చికెన్ తందూరి రెడీ!