వెజిటేబుల్స్’లో మానవ శరీరానికి కావలసిన ఎన్నోరకాల పోషకవిలువలు నిల్వవుంటాయని అందరికీ తెలుసు! కాబట్టి అటువంటి వాటితో ఆహారాలను వండుకుని తింటే నిత్యం ఆరోగ్యంగా వుండొచ్చు. అయితే ఈ కూరగాయలతోబాటు కోడిగుడ్డును కూడా కలిపి తీసుకుంటే.. ఇంకా ఆరోగ్యంగా వుండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. గుడ్డు ఎలాగో అత్యంత దివ్య ఔషధంగా పరిగణించబడిన విషయం విదితమే! అలాంటి గుడ్డుతోబాటు కూరగాయలను కలిపి తీసుకుంటే.. బోలెడన్నీ పోషకాలు శరీరానికి అందుతాయి. దాంతో.. ఏ రకమైన జబ్బులు కూడా దరిచేరవు. ఈ రెండింటి కాంబినేషన్’లో వెజిటబుల్ ఎగ్ పులావ్ చేస్తే.. రుచితోబాటు ఆరోగ్యంగా వుండొచ్చు. మరి దాన్నెలా తయారుచేస్తారో చూద్దాం...
ఈ వెజిటబుల్ ఎగ్ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలను ఒకవైపు ముందుగానే సేకరించు పెట్టుకోవాలి. అవి : కోడి గుడ్లు (10); బియ్యం (2 కేజీలు); ఉల్లిపాయ ముక్కలు (1 కప్పు); కరివేపాకు (2 టీ స్పూన్లు); కొత్తిమీర (1 కట్ట); గరం మసాలా (2 టీ స్పూన్లు); నూనె (తగినంత); నెయ్యి (2 టీ స్పూన్లు); కారం (2 టీ స్పూన్లు); పసుపు (చిటికెడు); లవంగాలు (6); దాల్చిన చెక్కలు (6); మిక్స్డ్ వెజిటేబుల్స్ (2 కప్పులు); అల్లం వెల్లుల్లి ముద్ద (1/4 కప్పు); పచ్చిమిర్చి తరుగు (3 టీ స్పూన్లు); ఎండుమిర్చి తరుగు (4 టీ స్పూన్లు); చివరగా రుచికి సరిపడేంత ఉప్పు.
తయారుచేసే విధానం :
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరోవైపు ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో కోడిగుడ్లను దోరగా వేగినట్లు అట్టుపోసి పక్కనపెట్టుకోవాలి. వీటిలో నాలుగు గుడ్లను మాత్రం బాగా ఉడికించుకోవాలి. అనంతరం వీటిన్నింటిని పక్కన పెట్టుకోవాలి.
2. మరోవైపు స్టౌ మీద ఒక పాన్‌ను పెట్టి అందులో నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి. వేడయ్యాక అందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా గరంమసాలా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కోడిగుడ్డు అట్టు ముక్కలతోబాటు కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా అయ్యేవరకూ ఉడికించి దించేయాలి.
3. అదే స్టౌ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులో తగినంత నూనె పోసి వేడి చేయాలి. బాగా కాగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయల తరుగు, ఎండు మిరపకాయల తరుగు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి.. వాటన్నింటిని కలుపుతూ వేయించాలి.
4. ఆ మసాలా మిశ్రమం మొత్తం బాగా వేడయ్యాక.. అందులో ఇదివరకే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి గరిటతో కలపాలి. అలాగే ఇందులో గరంమసాలా, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి కాసేపు బియ్యాన్ని వేగించుకోవాలి.
5. బియ్యం వేగుతుండగానే ఇందులో ఇదివరకే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్డు అట్టుముక్కల కూర వేసి కలపాలి. వెజిటబుల్స్ ముక్కలు కూడా చేర్చి ఒక లీటరు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇక చివరగా.. నెయ్యివేసి ఉడికించి పెట్టుకున్న గుడ్లను ముక్కలుగా కోసి పలావుపైన గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడి ఎగ్ పులావ్ రెడీ!