సాధారణంగా చేపలతో కూడిన వంటకాలను చేసేందుకు ఎక్కువ సమయంతోపాటు కాస్త ఇబ్బందిగా వుంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయా వంటకాల్లో వేయాల్సిన పదార్థాలను మరిచిపోతుంటారు. దీంతో ఆ రిసిపీ టేస్ట్ మారిపోవడంతోబాటు ఎంతో కష్టపడిన శ్రమ మొత్తం వృధా అవుతుంది. వంటకం చేయడానికి ముందు, తర్వాత ఎంతో శ్రమ, జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. మొత్తానికి వీటిని చేయడానికి ఎక్కువ సమయం కూడా పడుతుంది.
ఇక కర్రీల విషయానికొస్తే.. అందులో వేసే పదార్థాలు చాలావరకు కన్ఫ్యూజన్’గా వుంటాయి. అందులోనూ ‘‘గ్రీన్ ఫిష్ మసాలా’’ చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. అయితే.. కొన్ని పద్ధతుల ద్వారా ఈ రిసిపీని సింపుల్’గా చేయడంతోబాటు తక్కువ సమయంలోనే ముగించుకోవచ్చు. ముందుగా ఈ రిసిపీకి కావలసిన పదార్థాలను ఏకం చేసుకుని.. ఆ తర్వాత దీనిని తయారుచేయాల్సి వుంటుంది. మరి.. ఈ రిసిపీని ఎలా చేస్తారో తెలుసుకుందామా...
‘గ్రీన్ ఫిష్ మసాలా’ తయారీ విధానం :
1. ముందుగా చేప ముక్కలను కడిగేసుకుని వాటికి పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. మరోవైపు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కోయాలి.
3. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మసాలా దినుసులు, పాలకూర తదితర పదార్థాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4. ఇలా అన్ని పదార్థాలు తరుముకున్న అనంతరం ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో నూనె వేసి స్టౌవ్ మీద వేడి చేయాలి.
5. నూనె బాగా వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి మరిగించాలి. ఉల్లి బ్రౌన్ కలర్’లోకి వచ్చేవరకు వేయించాలి.
6. ఉల్లిరంగు మారిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి వేసి, రెండు సెకనుల తర్వాత పాలకూర మసాలా వేసి 5 నిముషాలపాటు ఉడికించాలి.
7. అలా ఉడికించిన అనంతరం ఆ మిశ్రమంలో టొమాటో గుజ్జు వేసి మరికొద్దిసేపటివరకు మరిగించాలి.
8. ఉడికిన తర్వాత అందులోనే చేపముక్కలు వేసి.. కాస్త పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి.. గిన్నెను తిప్పి.. నీరంతా ఇగిరేవరకూ తక్కువ మంటమీద ఉడికించాలి.
9. బాగా ఉడికిన అనంతరం మంచివాసన రావడం మొదలవుతుంది. అప్పుడు అందులో కొత్తిమీర చల్లి క్రిందకు దించేయాలి. అంతే!