సీఫుడ్ వంటకాల్లో ఒకటైన రొయ్యలకర్రీని ప్రతిఒక్కరూ తినడానికి ఇష్టపడతారు. ఈ రొయ్యలతో రకరకాల కర్రీలను తయారుచేయొచ్చు. సాధారణంగా చేపలతో ఏ విధమైన రిసిపీలను చేస్తారో.. రొయ్యలతోనూ అలాగే చేస్తారు. ఆ రిసిపీలలో మలాయ్ రొయ్యలకర్రీ ఇంకా రుచికరంగా వుంటుంది. అయితే ఈ వంటకానికి మిల్క్ క్రీమ్ కలిపితే... దానికి మరింత టేస్టీ తోడవుతుంది. మరి.. ఈ కర్రీని ఎలా చేస్తారో తెలుసుకుందామా..
ముందుగా దీని తయారీకి కావలసిన పదార్థాలను ముందుగానే ఏకం చేసుకోవాలి. అవి : పచ్చిరొయ్యలు; ఉల్లిపాయలు; అల్లంవెల్లుల్లి పేస్ట్; టొమాటో పేస్ట్; మిల్క్ క్రీమ్; కారం; నూనె; కసూరీ మేథీ; పచ్చిమిర్చి; కొత్తిమీర; వెల్లుల్లి; అల్లం ముక్కలు; జీడిపప్పు; గరంమసాలా; ఉప్పు తదితర పదార్థాలను రిసిపీకి తగినంత మోతాదులో తీసుకోవాలి.
తయారీవిధానం :
1. పచ్చిరొయ్యలను శుభ్రంగా కడిగి.. వాటికి ఉప్పు, కారం కలిపి ఒక పాత్రలో వుంచి పక్కన పెట్టాలి.
2. స్టౌవ్ మీద ఒక బాణలిని తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో రొయ్యల్ని దోరగా వేయించి, వాటిని పక్కన పెట్టుకోవాలి.
3. అదే నూనెలో ఉల్లిపాయ ముద్దును వేసి కాసేపు వేయించాలి. అనంతరం అందులో వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిర్చి ముద్ద తదితర పదార్థాలు కూడా వేసి కొద్దిసేపటివరకు వేయించాలి. చివరకు టొమాటో పేస్ట్’ను కూడా వేసి.. కలియబెడుతూ బాగా ఉడికించాలి.
4. కొద్దిసేపటి వరకు ఆ టొమాటో మిశ్రమంలో ఇదివరకు వేయించిన రొయ్యలను, తగినంత ఉప్పు వేసి మీడియం మంట మీద ఉడికించాలి. తర్వాత కసూరీ మేథీ, గరంమసాలా, జీడిపప్పులను కూడా వేసి కలియబెడుతూ వేయించాలి.
5. చివరగా కూరను కిందకు దించేముందు అందులో మిల్క్ క్రీమ్ కలుపుకోవాలి. అంతే! ఈ విధంగా క్రీమ్ కలిపిన తర్వాత ఈ రొయ్యల కర్రీని సర్వ్ చేసుకోవచ్చు.