ప్రస్తుత రోజుల్లో నాన్’స్టిక్ పాత్రల వాడకం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇతర పాత్రలతో పోల్చుకుంటే.. ఈ నాన్’స్టిక్ పాత్రలతో వంటలు చేసుకోవడం చాలా సులభం. వీటిని రెగ్యులర్’గా వాడటం వల్ల చాలా త్వరగా తుప్పుపట్టి పాడైపోతాయి. అలాకాకుండా వీటిని నిత్యం శుభ్రపరుస్తూ వుంటే మంచిది. వాటిని శుభ్రపరుచుకోవడం కూడా చాలా సింపుల్!
వీటిని క్లీన్’గా శుభ్రపరుచుకోవడానికి మార్కెట్లో ఎన్నోరకాల పౌడర్లు, సబ్బులతోబాటు మరికొన్ని ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో వున్నాయి. కానీ.. సరైన పద్ధతిలో క్లీనింగ్ చిట్కాలు పాటించకపోవడం వల్ల ఆ నాన్’స్టిక్ పాత్రలు పాడయిపోయి, ఉపయోగం లేకుండా పోతున్నాయి. కాబట్టి.. ఆ పాత్రలను శుభ్రపరిచే విధానాలను తెలుసుకుంటే.. చాలా మంచిది.
నాన్’స్టిక్ పాత్రలను శుభ్రపరిచే సులువైన చిట్కాలు :
1. కొత్తగా కొనుగోలు చేసిన నాన్’స్టిక్ పాత్రలను వాడటానికి ముందు వాటిపై అతికించి వుండే స్టిక్కర్స్’ను తొలగించుకోవాలి. ఆ పాత్రను కొద్దిగా వేడిచేస్తే.. ఆ స్టిక్కర్ ఊడివస్తుంది. తర్వాత వేడినీటితో శుభ్రంచేసి ఆరబెట్టాలి. అనంతరం ఆ పాత్రపై కొద్దిగా నూనెవేసి, మెత్తని బట్టతో మొత్తం రాయాలి.
2. ఈ పాత్రలను వాడిన ప్రతిసారి సన్నని సెగపైనే వుంచాలి. అలాకాకుండా ఎక్కువ మంటపెడితే.. వాటి పాలిష్ త్వరగా పోతుంది. ఫలితంగా పాత్ర పాయిపోతుంది. అలాకాకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది.
3. ఈ పాత్రల్లో వండే పదార్థాలను కలిపే సమయంలో ప్లాస్టిక్ లేదా చెక్క గరిటెలను మాత్రమే వాడాలి. ఇనుము, స్టీల్, ఇత్తడి, సిల్వర్ వంటి గరిటెలను, అట్లకాడలను తదితరాలను వాడకూడదు.
4. వండే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ పాత్రలను శుభ్రం చేసేందుకు ధృఢంగా ఉండే పీచు, స్టీల్, ప్లాస్టిక్ వంటివాటిని వాడకూడదు. ఎప్పుడూ మెత్తని పీచుతోగాని, బ్రష్తోగానీ, లిక్విడ్ సోప్లతోగానీ శుభ్రం చేయాలి.
5. కొన్ని సందర్భాల్లో ఈ పాత్రలకు ఏవైనా పదార్థాలు అతుక్కుపోతాయి. ఆ సమయంలో వాటిని చాకు, చెమ్చా వంటివాటితో పెల్లగించకూడదు. పాత్రలో నీటిని పోసి కొద్ది సమయం నాననివ్వాలి. తర్వాత మెల్లగా రుద్దికడిగితే అతుకున్న పదార్థం వదిలిపోతుంది.
6. నాన్’స్టిక్ పాత్రలు కదా అని ప్రత్యేకమైన స్థానాల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సామాన్లు భద్రపరిచే స్టాండుల్లోనే పెట్టడం మంచిది. ఇలా వుంచడంవల్ల వస్తువు పైభాగంలో ఉండే పెయింటింగ్ ఎక్కువకాలం పోకుండా ఉంటుంది.
7. వంటకార్యక్రమాలు ముగిసిన వెంటనే నీటితో శుభ్రంచేసి, మెత్తని పొడిబట్టతో తుడిచి, కొద్దిగా నూనెను రాసి భద్రపరుస్తుండాలి. ఇలా చేస్తే.. పాత్ర ఎల్లప్పుడూ కొత్తగా, మెరుస్తూ కనిపిస్తుంది.