కాలానికి అనుగుణంగా వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. నిన్నటివరకు నిలకడగా వున్న ధరలు నేడు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతున్నాయి. అలా ధరలు పెరుగుతున్న వస్తువుల్లో గ్యాస్ కూడా ఒకటి! మొన్నటివరకు ఓ మోస్తరు ధర పలికిన గ్యాస్.. నేడు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే! అలాంటప్పుడు గ్యాస్’ను ఎంత పరిమితంగా వాడుకుంటే అంతే మంచిది. అలా అని వంటకాలు చేయకుండా వుండటమని కాదు అర్థం.. వంటకాలు చేసే సమయంలోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.. గ్యాస్ వృధా కాకుండా ఆదా చేసుకోవచ్చు. అలాగే.. వంటను కూడా త్వరగా ముగించుకోవచ్చు.
అంతేకాదు.. ఇంకా చాలా ప్రయోజనాలే వున్నాయి. ముఖ్యంగా వంటను ఎంతో రుచికరంగా, పోషక విలువలు కోల్పోకుండా చేసుకోవచ్చు. సరైన మంట, తగినంత నీరు, పాత్రలు, సరైన పదార్థాలు వంటి విషయాలపై పూర్తి అవగాహన వుంటే.. రుచికరంగా వంటను చేసుకోవడంతోబాటు గ్యాస్’ను సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అంశాలపై పూర్తి అవగాహన లేకపోతే.. అందుకు సంబంధించిన కొన్ని చిట్కాలు అందుబాటులో వున్నాయి. వాటిని తూచాతప్పకుండా పాటిస్తే.. గ్యాస్’ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. మరి.. అవేమిటో తెలుసుకుందామా...
1. ముందుగా వంటకు కావలసిన అన్ని వస్తువులను సిద్ధం చేసుకున్న తర్వాతే గ్యాస్ స్టౌవ్’ను వెలిగించుకోవాలి.
2. కాయగూరలను ఉడకబెట్టేందుకు అందుకు తగినంత నీరు మాత్రమే వాడాలి. అలాకాకుండా ఎక్కువ నీరు పోసి వండితే.. అందులో వున్న పోషకాలు వృథా అవడమే కాకుండా గ్యాస్, సమయం కూడా వృథా అవుతుంది. ఫలితంగా వంట రుచికరంగా కూడా వుండదు.
3. ఏ వంటకానికైనా ప్రెషర్ కుక్కర్ వాడితే చాలా మంచిది. దీంతో గ్యాస్’ను చాలావరకు ఆదా చేసుకోవచ్చు.
4. ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వేడి చేసేందుకు వెంటనే స్టౌవ్‌పై పెట్టకూడదు. ముందుగా వాటిని గది టెంపరేచర్ వద్ద కొద్దిసేపటివరకు ఉంచిన అనంతరం స్టౌవ్‌పై ఉంచి వేడి చేయాలి. అప్పుడవి త్వరగా వేడెక్కుతాయి.
5. గ్యాస్ స్టౌవ్ వెలిగించినపుడు మంట నీలిరంగులో ఉండాలి. అలాకాకుండా ఎరుపు లేదా ఆరెంజ్ రంగుల్లో మండుతున్నట్లు కనిపిస్తే.. గ్యాస్ వృథా అవుతున్నట్టు లెక్క! అప్పుడు దాన్ని వెంటనే గ్రహించి వెంటనే సర్వీసింగ్ చేయించాలి.
6. ఏదైనా వంటకం చేస్తున్న సమయంలో మంట పాత్ర అడుగుభాగాన్ని దాటి పైకి వస్తుంటే గ్యాస్ వృధా అవుతున్నట్టుగా గుర్తించాలి. అప్పుడు దాన్ని సిమ్’లో వుంచుకుంటే మంచిది.
7. గ్యాస్’పై ఏదైనా వంటకం చేస్తున్నప్పుడు ఆయా పాత్రలపై విధిగా మూతను వాడాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు వృథాకావు. పదార్థాలు త్వరగానూ ఉడుకుతాయి.
8. ముఖ్యంగా, స్టౌవ్‌ను ఎప్పటికపుడు సర్వీంగ్ చేయిస్తుంటే మంట బాగా వచ్చి త్వరగా అవుతుంది. బర్నర్ రంధ్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మూసుకుపోయిన రంధ్రాల వల్ల వంట సమయం పెరిగి గ్యాస్ వృథా అవుతుంది.