సాధారణంగా వంటకాలు చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా కూరలో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటారు. అప్పుడు ఆ కూర టేస్టు పూర్తిగా మారిపోతుంది. తినడానికి కూడా ఆసక్తి కలగదు. అలాంటప్పుడు ఆ కూరలో ఉప్పు సాంధ్రతను తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. గాబరాగా పనులను నిర్వర్తించుకుంటారు. దాంతో ఆ కూర పాడైపోతుంది. అలాకాకుండా కూరుల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు దానిని తగ్గించుకోవడానికి కొన్ని అనువైన చిట్కాలు వున్నాయి. అవి..
కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు పాటించాల్సిన చిట్కాలు :
1. ఉప్పు సాంధ్రత ఎక్కువగా వున్న కూరలో కొద్దిగా కొబ్బరిపాలు జతచేస్తే చాలు.. అందులో వుండే ఉప్పుదనం తగ్గి రుచికరంగా మారుతుంది.
2. ఒక బంగాళదుంపను తీసుకుని దానిపై వుండే తొక్కను పూర్తిగా తొలగించేయాలి. అనంతరం నాలుగు ముక్కలను కూరలో వేసి.. 10 నిముషాలపాటు ఉడకనివ్వాలి. ఉడికిన అనంతరం వీటిని బయటకు తీసేసి, కూరను వడ్డించుకోవచ్చు. ఈ దుంపలు కూరలో వుండే ఉప్పు సాంధ్రతను పూర్తిగా గ్రహిస్తాయి.
3. రెండు లేదా మూడు కప్పుల పెరుగును కూరలో కలపడం వల్ల ఉప్పు సాంధ్రత పూర్తిగా తగ్గిపోతుంది. పెరుగుకు బదులు మీగడను కూడా ఉపయోగించుకోవచ్చు.
4. ఇదివరికే కూరలో ఉల్లిపాయ, టమోటో పేస్ట్ వేసినట్లైతే.. మరికొంత ఉల్లి - టమోటో పేస్ట్ ను జతచేయవచ్చు.
5. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నూనెలో కొద్దిసేపటివరకు వేయించాలి. అనంతరం వీటిని కూరలో కలిపితే చాలు.
6. గోధుమ పిండికి కొద్దిగా నీటిని జతచేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని కూరలో వేసి 3 నుండి 4నిముషాలు ఉడకనిస్తే.. అవి ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత బయటకు తీసేయవచ్చు
7. ఒక వేళ కూరలో తక్కువ నీళ్ళు ఉంటే.. మరికొద్దిగా నీరు వేసి కూరని బాగా ఉడికించాలి. కూరలో ఉప్పు తగ్గడంతో పాటు రుచికరంగా కూడా మారాలనుకుంటే మాత్రం అందులో పాలు పోస్తే సరిపోతుంది.