దేశంలో ఇడ్లీ-దోసెకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత వుంది. ఉదయాన్నే తీసుకునే బ్రేక్’ఫాస్ట్’లలో అన్ని ఆహారాలు ఒక ఎత్తయితే.. ఈ ఇడ్లీ-దోసెలు మాత్రం మరో ఎత్తు! ఇవి తినడానికి ఎంతో రుచికరంగా వుంటాయి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతిఒక్కరు ఈ రెండింటిని ఎంతో ఇష్టంగా తింటారు.
ఇక్కడ ఇడ్లీ విషయం కాస్త పక్కనపెడితే.. దోసెకు మరీ విపరీతంగా ఫాలోయింగ్ వుంది. ఈ దోసెను రకరకాల పద్ధతుల్లో తయారుచేయొచ్చు. బయట మార్కెట్లలోని ఫుడ్ సెంటర్లలో వివిధ వెరైటీల దోసెలను రోజూ చూస్తూనే వుంటాం. అందులో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రాధాన్యత వుంటుంది.
ఇకపోతే ఈ దోసెల వెరైటీల్లో చాలామందికి బ్రౌన్ రైస్ దోసె గురించి అంతగా తెలిసివుండకపోవచ్చు. నిజానికి అన్నీ దోసెలు చూడ్డానికి ఒకేరకంగా కనిపించినా.. టేస్టులు మాత్రం వెరైటీగానే వుంటాయి. అందులో ఈ బ్రౌన్ రైస్ దోసె ఎంతో రుచిగా, శుచిగా వుండటంతోబాటు రోజంతా ఆరోగ్యంగా వుండేలా చేస్తుంది.
ఎర్రబియ్యంతో తయారయ్యే ఈ దోసెలు.. ఉదయాన్నే తింటే రాత్రివరకు కడుపు నింపుగా వుండేలా చేస్తుంది. అలాగే అన్నీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనవచ్చు కూడా! మరి ఇంతటి పౌష్టికరమైన ఈ దోసెను ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం..